
ఓం నమో భగవతే వాసుదేవాయ !
శ్రీకృష్ణ పరమాత్మ ముఖారవిందం నుండి వెలువడిన వేదోపనిషత్తుల సారమైన భగవద్గీత జ్ఞానం సాధకులకు సులభంగా అందించే లక్ష్యంతో ప్రముఖ చిత్రకారుడు శ్రీ నీలి వేంకటరమణ గారు 2010లో చిత్రలేఖన ప్రయాణం ప్రారంభించారు. 2017 గీతాజయంతి నాటికి, భగవద్గీతలోని 162 శ్లోకాలకు అద్భుతమైన చిత్రాలను రూపొందించి, శ్రీ జంపన శ్రీనివాస సోమరాజు గారి వ్యాఖ్యానంతో “భగవద్గీత భావచిత్రనుధ” గ్రంథాన్ని జిజ్ఞాసువులకు అందించారు.
బాలలు సులభంగా భగవద్గీతను అధ్యయనం చేయడానికి వీలుగా, 2019 గీతాజయంతి నాటికి “బాలల భగవద్గీత” ప్రచురించబడింది. ఈ గ్రంథం బాలలకు సరళమైన, దృశ్యాత్మక రూపంలో గీతా బోధనలను అందిస్తుంది. అదే విధంగా, గానగంధర్వుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు గారు ఆలపించిన గీతలోని 106 శ్లోకాలకు శ్రీ నీలి వేంకటరమణ గారి చిత్రాలతో కూడిన వీడియో రూపొందిచబడింది. ఇది యువత మరియు బాలలకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.